విషయానికి నేరుగా వెళ్ళండి
బీటా

దారం ఇంకా పూర్తిగా తెలుగులోకి అనువదించబడలేదు. ఇంకా అనువదించనివి ఇంగ్లీషులో కనిపిస్తాయి.

యెషయా 34

ఈ అధ్యాయం దీనికి చెందినది: Wee en hoop

1రాజ్యాలన్నీ నా దగ్గరికి వచ్చి నేను చెప్పేది వినండి, ప్రజలందరూ జాగ్రత్తగా ఆలకించండి. భూమీ దాని సంపూర్ణతా, లోకం, దానిలో పుట్టినదంతా వినాలి. 2యెహోవా కోపం రాజ్యాల మీదికి వస్తున్నది, ఆయన ఆగ్రహం వారి సర్వ సేనల మీదికీ వస్తున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించాడు. 3వారిలో చనిపోయిన వారిని ఎవరూ సమాధి చేయరు. వారి శవాలు కంపుకొడతాయి. వారి రక్తం కొండలను నింపేస్తుంది. 4ఆకాశ నక్షత్రాలన్నీ వాడిపోతాయి. ఆకాశం కాగితపు చుట్టలాగా చుట్టుకుపోతుంది. ద్రాక్షవల్లి నుండి, అంజూరపు చెట్టు నుండి వాడిన ఆకులు రాలినట్టు దాని నక్షత్రాలన్నీ రాలిపోతాయి. 5నిజంగా ఆకాశంలో నా ఖడ్గం మత్తెక్కినట్టు ఎదోము మీదికీ, నేను నాశనానికి నిర్ణయించిన జనం మీదికీ దిగివస్తుంది. 6యెహోవా ఖడ్గం రక్తమయమవుతుంది. అది కొవ్వుతో కప్పి ఉంటుంది. గొర్రెపిల్లల, మేకల రక్తం చేతా, పొట్లేళ్ల మూత్రపిండాల మీది కొవ్వు చేతా కప్పి ఉంటుంది. ఎందుకంటే బొస్రా నగరంలో యెహోవా బలి జరిగిస్తాడు. ఎదోము దేశంలో గొప్ప వధ చేస్తాడు. 7వాటితోపాటు అడవి ఎద్దులు, కోడె దూడలు వధకు పోతున్నాయి. ఎదోమీయుల భూమి రక్తంతో నానుతూ ఉంది. వారి దేశపు మట్టి కొవ్వుతో నిండిపోయింది. 8అది యెహోవా శిక్ష అమలుపరిచే రోజు. సీయోను పక్షంగా ప్రతీకారం చేసే సంవత్సరం. 9ఎదోము కాలువలు కీలులాగా, దాని మట్టి గంధకంగా మారిపోతుంది. దాని భూమి మండుతున్న గంధకంగా ఉంటుంది. 10అది రాత్రీ, పగలూ ఆరిపోకుండా ఉంటుంది. దాని పొగ ఎల్లప్పుడూ రేగుతూ ఉంటుంది. అది తరతరాలు పాడుగా ఉంటుంది. దానిలో గుండా ఇక ఎవ్వరూ ఎన్నటికీ ప్రయాణించరు. 11గూడబాతులు, అడవి మృగాలు దాన్ని ఆక్రమించుకుంటాయి. గుడ్లగూబలు, కాకులు అందులో నివసిస్తాయి. ఆయన నాశనం అనే కొలనూలును చాపుతాడు. వినాశనం అనే ఒడంబాన్ని చేత పట్టుకుంటాడు. 12రాజ్యం గురించి ప్రకటించడానికి వారి ప్రధానులు అక్కడ ఉండరు. దాన్ని పరిపాలించే వాళ్ళంతా గతించిపోయారు. 13ఎదోము నగరాల్లో ముళ్లచెట్లు పెరుగుతాయి. దాని దుర్గాల్లో దురదగొండ్లు, గచ్చపొదలు ఎదుగుతాయి. అది అడవికుక్కలకు, నిప్పుకోళ్లకు నివాసంగా ఉంటుంది. 14క్రూర జంతువులు, హైనాలు అక్కడ కలిసి తిరుగుతాయి. అడవిమేకలు ఒకదానిపై ఒకటి అరుస్తూ ఉంటాయి. అక్కడ చీకటి పక్షులు నివాసముంటాయి. 15గుడ్లగూబలు గూళ్ళు కట్టుకుని, గుడ్లు పెట్టి పొదుగుతాయి. అక్కడే తెల్లగద్దలు తమ జాతిపక్షులతో కలుసుకుంటాయి. 16యెహోవా గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానించండి. ఆ జంతువులన్నీ అక్కడ ఉండి తీరుతాయి. దేని జతపక్షి దాని దగ్గర ఉంటుంది. ఎందుకంటే యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు. ఆయన ఆత్మ వాటిని పోగు చేస్తాడు. 17అవి రావాలని ఆయన చీట్లు వేశాడు. ఆయన కొలనూలు పట్టుకుని వాటికి ఆ దేశాన్ని పంచిపెడతాడు. అవి శాశ్వతంగా దాన్ని ఆక్రమించుకుని ఉంటాయి. యుగయుగాలు దానిలో నివసిస్తాయి.

వచన సంఖ్యలు ఎంచుకున్న అనువాదాన్ని అనుసరిస్తాయి, కొన్ని అధ్యాయాల్లో ఒక వచనం తేడా ఉండవచ్చు.

చదివే సౌలభ్యం

మీకు సహాయపడేదాన్ని ఎంచుకోండి. మీ ఎంపిక ఈ పరికరంలోనే ఉంటుంది.

అక్షరాల పరిమాణం

మీ పరికరం సొంత సెట్టింగ్‌లు (జూమ్, స్క్రీన్ రీడర్, డార్క్ మోడ్) ఇష్టమా? అవి ఇక్కడ కూడా పనిచేస్తాయి.