విషయానికి నేరుగా వెళ్ళండి
బీటా

దారం ఇంకా పూర్తిగా తెలుగులోకి అనువదించబడలేదు. ఇంకా అనువదించనివి ఇంగ్లీషులో కనిపిస్తాయి.

యెషయా 23

ఈ అధ్యాయం దీనికి చెందినది: Over de volken

1ఇది తూరును గూర్చిన దైవ ప్రకటన. తర్షీషు ఓడలారా, పెడ బొబ్బలు పెట్టండి. ఎందుకంటే ఓడరేవు గానీ ఆశ్రయం గానీ లేవు. కిత్తీము దేశం నుండి వాళ్లకి ఈ విషయం వెల్లడి అయింది. 2సముద్ర తీరవాసులారా! సీదోను పట్టణంలోని వర్తకులారా! విభ్రాంతి చెందండి. సముద్రంపై వస్తూ పోతూ ఉండేవాళ్ళు తమ సరుకులు మీకు సరఫరా చేశారు. 3మహా సముద్రంపై ప్రయాణించి షీహోరు ప్రాంతం ధాన్యం, నైలు నదికి చెందిన పంట తూరుకు వస్తూ ఉండేవి. తూరు దేశాలన్నిటికీ వర్తక కేంద్రంగా ఉండేది. 4సీదోనూ, సిగ్గుపడు, ఎందుకంటే సముద్రం మాట్లాడుతుంది. సముద్ర బలిష్టుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు. “నేను పురిటినొప్పులు పడలేదు. పిల్లలకు జన్మనివ్వలేదు. నేను పిల్లలను పోషించలేదు, కన్యకలను పెంచలేదు.” 5ఆ సమాచారం విని ఐగుప్తు ప్రజలు తూరును గురించి వేదన చెందుతారు. 6సముద్ర తీరవాసులారా! రోదించండి. తర్షీషుకి తరలి వెళ్ళండి. 7ఎప్పుడూ ఆనందిస్తూ ఉండే పట్టణం, పురాతన కాలంలో మూలాలున్న పట్టణం, పాశ్చాత్య దేశాల్లో నివాసం ఉండటానికి సుదూర ప్రయాణాలు చేసే పట్టణం, నీకే ఇలా జరిగిందా? 8తూరు వర్తకులు రాజకుమారుల్లాంటి వాళ్ళు. అక్కడ వ్యాపారం చేసే వాళ్ళు భూమిపై గౌరవం పొందిన వాళ్ళు. తూరు కిరీటాలు పంచే పట్టణం. దానికి వ్యతిరేకంగా పథకం వేసిందెవరు? 9ఆమె గర్వాన్నీ, ఘనతా ప్రాభవాలనూ అగౌరవ పరచడానికీ, భూమి మీద ఘనత పొందిన ఆమె పౌరులను అవమాన పరచడానికీ సేనల ప్రభువైన యెహోవా సంకల్పించాడు. 10తర్షీషు కుమారీ, నీ భూమిని దున్నడం మొదలు పెట్టు. నైలు నదిలా నీ భూమిని విస్తరింపజెయ్యి. తూరులో వ్యాపార కేంద్రం ఇక లేదు. 11యెహోవా తన చేతిని సముద్రంపై చాపాడు. ఆయన రాజ్యాలను కంపింపజేశాడు. కనానులో కోటలను నాశనం చేయాలని ఆజ్ఞ జారీ చేశాడు. 12ఆయన ఇలా అన్నాడు “పీడన కింద ఉన్న సీదోను కన్యా, నీకిక సంతోషం ఉండదు. నువ్వు కిత్తీముకి తరలి వెళ్ళు. కానీ అక్కడ కూడా నీకు విశ్రాంతి కలగదు.” 13కల్దీయుల దేశాన్ని చూడండి. వాళ్ళిప్పుడు ఒక జనంగా లేరు. అష్షూరు వాళ్ళు దాన్ని క్రూర మృగాలు నివసించే అడవిగా చేశారు. దాని ముట్టడికై వాళ్ళు గోపురాలు కట్టారు. దాని భవనాలను ధ్వంసం చేశారు. దేశాన్ని శిథిలంగా చేశారు. 14తర్షీషు ఓడలారా, పెడ బొబ్బలు పెట్టండి. మీ ఆశ్రయ దుర్గం నాశనమైంది. 15ఒక రాజు జీవిత కాలంలా డెబ్భై సంవత్సరాలు తూరును మర్చిపోవడం జరుగుతుంది. డెబ్భై సంవత్సరాలు ముగిసిన తర్వాత తూరులో ఒక వేశ్యా గీతంలో ఉన్నట్టు జరుగుతుంది. 16అంతా మర్చిపోయిన వేశ్యా! తంతి వాద్యం తీసుకుని పట్టణంలో తిరుగులాడు. అందరూ నిన్ను జ్ఞాపకం చేసుకునేలా దాన్ని చక్కగా వాయించు. ఎక్కువ పాటలు పాడు. 17డెబ్భై సంవత్సరాలు ముగిసిన తర్వాత యెహోవా తూరుకు సహాయం చేస్తాడు. అది తిరిగి తన జీతం సంపాదించుకోడానికి భూమి పైన ఉన్న అన్ని రాజ్యాలతో వేశ్యలాగా వ్యవహరిస్తుంది. 18ఆమె పొందిన లాభం, సంపాదన యెహోవాకు చెందుతుంది. దాన్ని సేకరించడం, జమ చేయడం జరగదు. యెహోవా సన్నిధిలో నివసించే వారి భోజనానికీ, మంచి బట్టలకీ ఆమె వర్తక లాభం వినియోగిస్తారు.

వచన సంఖ్యలు ఎంచుకున్న అనువాదాన్ని అనుసరిస్తాయి, కొన్ని అధ్యాయాల్లో ఒక వచనం తేడా ఉండవచ్చు.

చదివే సౌలభ్యం

మీకు సహాయపడేదాన్ని ఎంచుకోండి. మీ ఎంపిక ఈ పరికరంలోనే ఉంటుంది.

అక్షరాల పరిమాణం

మీ పరికరం సొంత సెట్టింగ్‌లు (జూమ్, స్క్రీన్ రీడర్, డార్క్ మోడ్) ఇష్టమా? అవి ఇక్కడ కూడా పనిచేస్తాయి.