విషయానికి నేరుగా వెళ్ళండి
బీటా

దారం ఇంకా పూర్తిగా తెలుగులోకి అనువదించబడలేదు. ఇంకా అనువదించనివి ఇంగ్లీషులో కనిపిస్తాయి.

యోబు 33

ఈ అధ్యాయం దీనికి చెందినది: Elihu

1యోబు, దయచేసి నా వాదం ఆలకించు. నా మాటలన్నీ విను. 2ఇదిగో నేను మాటలాడడం మొదలుపెట్టాను. నా నోట నా నాలుక ఆడుతున్నది. 3నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుతున్నాయి. నా పెదవులు జ్ఞానాన్ని యథార్థంగా పలుకుతాయి. 4దేవుని ఆత్మ నన్ను సృష్టించింది. సర్వశక్తుని శ్వాస నాకు జీవమిచ్చింది. 5నీ చేతనైతే నాకు జవాబియ్యి. నా ఎదుట నీ వాదం సిద్ధపరచుకో. వ్యాజ్యెమాడు. 6దేవుని దృష్టిలో నేను కూడా నీలాంటి వాణ్ణి. నేను కూడా బంకమట్టితో తయారైన వాణ్ణి. 7నా భయం నిన్ను బెదిరించదు. నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు. 8నిశ్చయంగా నీ పలుకులు నా చెవిని బడ్డాయి. నీ మాటల ధ్వని నాకు వినబడింది. 9ఏమంటే “నేను నేరం లేని పవిత్రుణ్ణి, మాలిన్యం లేని పాపరహితుణ్ణి. 10ఆయన నా మీద తప్పులెన్నడానికి తరుణం వెతుకుతున్నాడు. నన్ను తనకు పగవానిగా భావిస్తున్నాడు. 11ఆయన నా కాళ్లను బొండలో బిగిస్తున్నాడు. నా దారులన్నిటినీ కనిపెట్టి చూస్తున్నాడు” అని నీవంటున్నావు. 12నేను నీకు జవాబు చెబుతాను. నీవు ఇలా చెప్పడం సరికాదు. దేవుడు మానవుడికన్నా గొప్పవాడు. 13నీవెందుకు ఆయనతో పోరాడతావు? తన క్రియల్లో దేన్ని గురించీ ఆయన సంజాయిషీ చెప్పుకోడు. 14దేవుడు ఒక్కమారే పలుకుతాడు. రెండు సార్లు పలుకుతాడు. అయితే మనుషులు అది కనిపెట్టరు. 15మంచం మీద కునికే సమయంలో, గాఢనిద్ర పట్టేటప్పుడు వచ్చే స్వప్నాల్లో మాట్లాడుతాడు. 16ఆయన మనుషుల చెవులను తెరుస్తాడు. వారిని భయపెడతాడు. 17మనుషులు గర్విష్ఠులు కాకుండా చేయడానికి, తాము తలపెట్టిన పాపకార్యం వారు మానుకొనేలా చేయడానికి, 18గోతికి పోకుండా వారి జీవాన్ని, మరణం కాకుండా వారి ప్రాణాన్ని తప్పించడానికి, 19వ్యాధిచేత మంచం పట్టడం మూలంగానూ, ఒకడి ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలగడం మూలంగానూ వాణ్ణి శిక్షిస్తాడు. 20రొట్టె, రుచిగల ఆహారం వాడికి అసహ్యం అవుతుంది. 21వాడి ఒంట్లో మాంసం క్షీణించిపోయి వికారమై పోతుంది. బయటికి కనబడని ఎముకలు పైకి పొడుచుకు వస్తాయి. 22వాడు సమాధికి దగ్గర అవుతాడు. వాడి ప్రాణం హంతకులకు చేరువ అవుతుంది. 23మనుషులకు యుక్తమైనది ఏదో దాన్ని వాడికి తెలియజేయడానికి వేలాది దేవదూతల్లో ఒకడు వాడికి మధ్యవర్తిగా ఉంటే, 24ఆ దేవదూత వాడిపై కరుణ చూపి దేవునితో “పాతాళంలోకి దిగిపోకుండా ఇతన్ని విడిపించు. ఇతని పక్షంగా పరిహారం దొరికింది” అని గనక అంటే, 25అప్పుడు వాడి మాంసం చిన్నపిల్లల మాంసం కన్నా ఆరోగ్యంగా ఉంటుంది. వాడికి తన యవ్వన బలం తిరిగి కలుగుతుంది. 26వాడు దేవుణ్ణి బతిమాలుకుంటే ఆయన వాణ్ణి కటాక్షిస్తాడు. కాబట్టి వాడు ఆయన ముఖం చూసి సంతోషిస్తాడు. ఇలా ఆయన మనిషికి నిర్దోషత్వం దయచేస్తాడు. 27అప్పుడు వాడు మనుష్యుల ఎదుట సంతోషిస్తూ ఇలా అంటాడు. “నేను పాపం చేసి యథార్థమైన దాన్ని వక్రం చేశాను. అయినా నా పాపానికి తగిన ప్రతీకారం నాకు కలగలేదు. 28కూపంలోకి దిగిపోకుండా నా ప్రాణాన్ని ఆయన విమోచించాడు. నా జీవం వెలుగును చూస్తున్నది.” 29చూడు, మానవుల కోసం దేవుడు రెండు సార్లు, మూడు సార్లు ఈ క్రియలన్నిటినీ చేస్తాడు. 30కూపంలోనుండి వారిని మళ్ళీ రప్పించాలని, మనుషులు సజీవులకుండే వెలుగుతో వెలిగించబడాలని ఇలా చేస్తాడు. 31యోబు, శ్రద్ధగా విను. నా మాట ఆలకించు. మౌనంగా ఉండు. నేను మాట్లాడతాను. 32చెప్పవలసిన మాట ఏదైనా నీకుంటే నాకు జవాబు చెప్పు. మాట్లాడు, నువ్వు నీతిమంతుడవని నిరూపించుకో. 33అలా కాకుంటే నా మాట ఆలకించు. మౌనంగా ఉండు, నేను నీకు జ్ఞానం బోధిస్తాను.

వచన సంఖ్యలు ఎంచుకున్న అనువాదాన్ని అనుసరిస్తాయి, కొన్ని అధ్యాయాల్లో ఒక వచనం తేడా ఉండవచ్చు.

చదివే సౌలభ్యం

మీకు సహాయపడేదాన్ని ఎంచుకోండి. మీ ఎంపిక ఈ పరికరంలోనే ఉంటుంది.

అక్షరాల పరిమాణం

మీ పరికరం సొంత సెట్టింగ్‌లు (జూమ్, స్క్రీన్ రీడర్, డార్క్ మోడ్) ఇష్టమా? అవి ఇక్కడ కూడా పనిచేస్తాయి.